Thursday, December 17, 2009

ఖాకీబతుకులు

ఖాకీబతుకులు

1999 వ సంవత్సరం. సెంట్రల్ యూనివర్సిటీలోని ‘గోప్స్’ లో ఒక సాయంత్రం. 5:30 గంటలు.
తాగుతున్న టీ ముగిస్తూ మిత్రులు అప్పాజీ, "నువ్వు చదవాల్సిన పుస్తకమొకటుంది. పద!" అన్నారు.
పదినిమిషాల తరువాత NRS హాస్టల్లో ఉన్నాం. నాచేతిలో చెక్క తుండంత పుస్తకం ఒకటి పెట్టాడు.
పుస్తకం పేరు ‘ఖాకీబతుకులు’. రచయిత స్పార్టకస్.
"ఎప్పుడూ వినలేదే?" అనాను.
"ఇప్పుడు చేతికొచ్చింది కదా. చదువు." నవ్వుతూ అన్నారు అప్పాజి.
"అంతమంచి పుస్తకమా?" మరో ప్రశ్న.
"చదవాల్సిన పుస్తకం"
"ఎందుకుచదవాలి?"
"ఎందుకో నేను వివరించలేను. అందుకే చదవాలి."
"ఇంతకూ దేనిగురించీ పుస్తకం?"
"పోలీసుల గురించి. దళితుల గురించి.దొరతనం గురించి. జీవితం గురించి. బాసిజం గురించి. బానిసిజం గురించి. పోలీసుల కష్టాల గురించి. వ్యవస్థ సంస్కరణల గురించి.మనుషుల గురించి."
"చాలా ‘గురించిలు’ ఉన్నాయే! "
"ఐతే చదువు. ఇప్పుడే వస్తాను" అని అప్పాజీ వెళ్ళిపోయారు.
పుస్తకాలలోని ముందుమాటని చివర్లో చదివే అలవాటు నాది. ఆ రాసింది రచయితే అయితే, "చెప్పాల్సిన సోది పుస్తకంలో చెప్పేసి మళ్ళీ కొసరు సోది ఎందుకురాస్తోరో" అనుకుని ముందుమాటలు మొదట్లో చదవను. వేరొకరు రాస్తే, "వీడి అభిప్రాయం ముందేచదివేసి ఆ కళ్ళజోడుతో పుస్తకం చదివితే నాకళ్ళెందుకని?" అనుకుని ఆ ముందుమాట చదవను.
సూటిగా...పుస్తకంలోకే దూకాను.
బాధపడ్డాను. ఆవేశపడ్డాను. ఆవేదనకు గురయ్యాను. ఆశ్చర్యపోయాను. నా అజ్ఞానానికి చింతించాను. కొపగించాను. వ్యవస్థను పెళ్ళగించాలని విప్లవించాను. అస్సహాయంగా తిట్టుకున్నాను.
అప్పాజీ ఎనిమిది గంటలకొచ్చి "బోజనానికి వెళ్దాం" అన్నారు.
"నాకు ఆకలిగా లేద"న్నాను.
పదకొండు గంటలకి అప్పాజీ పడుకుంటూ," నిద్రపోవా?" అని అడిగారు.
"ఇది చదివేసి" అన్నాను.
గుండెబరువెక్కింది. కళ్ళలో నీళ్ళొచ్చాయి. ఏడ్చాను. ఏడుస్తూ చదివాను. కళ్ళ మసకల్లోంచీ అక్షరాల్ని చీల్చుకుంటూ చదివాను. నన్నునేను కాల్చుకుంటూ చదివాను. నాలాంటి ఎందరివో జీవితాలతో పోల్చుకుంటూ చదివాను. పుస్తకం గురించి అడుగుతూ నేను వృధాచేసిన నాలుగు నిమిషాల్నీ తల్చుకుంటూ చదివాను.
దాదాపు 800 వందల పేజీల పుస్తకం. తెల్లారి ఏడుగంటలకి పూర్తయ్యింది. పుస్తకాన్ని చేతిలో పట్టుకుని హాస్టల్ వరకూ కలలో వచ్చాను. పుస్తకాన్ని దిండుగా మార్చుకుని కాట్ మీద పడుకున్నాను. కలత నిద్ర. కలల నిద్ర. భయంకరమైన నిజాల నిద్ర. ఏమీ చెయ్యలేని నిస్సహాయమైన నిద్ర. రొజంతా నిద్ర. ఆ రోజు క్లాసులకు పోలేదు. ఇప్పటీకీ ఆపుస్తకం నీడ నన్ను విడిచిపోలేదు.
ఆ తరువాత ఆ పుస్తకం నాలో మిగిలిందేతప్ప నాచేతికి మళ్ళీ అందలేదు. 2003 లో సొంతంగా పుస్తకాలు కొనే స్థాయికి వచ్చినప్పటి నుంచీ ఆ పుస్తకం కోసం వెతుకుతూనే ఉన్నాను.
"ఔట్ ఆఫ్ ప్రింట్"
"ఆ పుస్తకం దొరకదండీ"
"ఒకే సారి ప్రింట్ అయ్యిందండీ. ఇప్పుడు లేదు."
"ఎప్పుడు వస్తుందో తెలీదు." ఇవే సమాధానాలు వింటూ వస్తున్నాను.
ఈ మధ్యనే అమెరికాలో ఉన్న ఒక స్నేహితురాలు. "నాదగ్గరుంది. కావాలా" అంటే నా చెవుల్ని నేనే నమ్మలేదు.
బహుశా నమ్మలేదు కాబట్టే, మర్చిపోయానుకూడా.
హైదరాబాద్. జూలై, 2009
నిన్న హైదరాబాదొచ్చి కలిసినప్పుడు, నా ముందొక పుస్తకం పెట్టారు.
"ఖాకీబతుకులు" రచయిత "స్పార్టకస్"
కళ్ళల్లో నీళ్ళొచ్చాయో లేదో తెలీదు. పుస్తకం మాత్రం మసగ్గా కనిపించింది.
మళ్ళీ అదేరాత్రి పునరావృతమయ్యింది. చదివాను. మళ్ళీ చదివాను.
ఈ నవల మొదటి భాగం మాత్రమే. రెండో భాగం ఇంతవరకూ రాలేదు. వ్యవస్థ ఇలా ఉండేంతవరకూ బహుశా రాదుకూడా.
ఏమీ మారలేదు. ఈ రోజు నేను ఆఫీసుకి వెళ్ళలేదు. అంతే!